✌ వ్యసనాల చికిత్సపై పుస్తకం ఆవిష్కరణ
July 30, 2020
✌మద్యం, మాదక ద్రవ్యాల దుర్వియోగ రుగ్మతలు, ప్రవర్తనాపరమైన వ్యసనాల చికిత్సపై పుస్తకం ఆవిష్కరణ
- మద్యం, మాదక ద్రవ్యాల దుర్వియోగంతో తలెత్తే రుగ్మతలు, ప్రవర్తనాపరమైన వ్యసనాల చికిత్సా నిర్వహణ - ప్రమాణబద్ధమైన మార్గదర్శకాలు అన్న శీర్షికతో ఒక పుస్తకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆవిష్కరించారు.
- దేశంలో మత్తు మందుల దుర్వినియోగ రుగ్మతలు, ప్రవర్తనా పరమైన వ్యసనాలకు చికిత్స అందించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ పుస్తకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మాట్లాడుతూ,..మద్యం, మత్తు మందుల దుర్వినియోగ వ్యసనం క్రమంగా ఒక ప్రజారోగ్య సమస్యగా రూపుదాల్చుతోందని, ప్రత్యేకించి యువతలో, కిశోర ప్రాయంలోని వారిలో ఈ రుగ్మత ఎక్కువగా ఉందని అన్నారు.
- సమాజం అధునాతన జీవన శైలికి అలవుడుతున్న నేపథ్యంలో, ఈ సమస్య మరింత విస్తృతరూపం దాల్చే ఆస్కారం ఉందన్నారు. ప్రవర్తనాపరమైన ప్రతికూల పరిణామాల కారణంగా ఆత్మహత్యల వేగం పెరిగిందని, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇది మనకు అనుభవమైందని చౌబే చెప్పారు.
- ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, సంబంధిత ఇతర వర్గాల ఆధ్వర్యంలో వ్యసనాలను మాన్పించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు.
- డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ,..మద్యం, మత్తు మందులకు బానిసలయ్యే రుగ్మతకు, హృద్రోగ సంబంధమైన సమస్యలు, కేన్సర్, రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం, మానసిక అనారోగ్యం వంటి సమస్యలకు మధ్య సంబంధాలున్నాయని ఇప్పటికే పూర్తిస్థాయిలో రుజువైందన్నారు. జూదం, సైబర్ సంబంధమైన వ్యసనాలు, లైంగిక వ్యసనాలు, పోర్నోగ్రఫీ, ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలవడం, వంటి రుగ్మతలకు చికిత్సపై మార్గదర్శక సూత్రాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.'
- కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో,..వ్యసనపరమైన సవాళ్లను నిర్మూలించవలసిన అవసరం ఎంతో ఉందన్నారు.
- కోవిడ్ -19 సంక్షోభం కారణంగా మరిన్ని దుష్ప్రభావాలను ఎదుర్కొనవలసి ఉంటుందని ప్రపంచ మాదక ద్రవ్యాల వినియోగంపై ఈ ఏడాది నివేదిక సూచిస్తున్నట్టు చెప్పారు.
- గతంలో ఆర్థిక మాంధ్యం కారణంగా తలెత్తిన పర్యవసానాల వంటివే ఇప్పుడూ ఎదురయ్యే ఆస్కారం ఉందన్నారు.
- పేదలు, తమకు ఏ మాత్రం అవకాశాలు దక్కనివారు మత్తు మందులు, మాదక ద్రవ్యాల వ్యసనానికి, ఆ వ్యసనాల పర్యవసానాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. పొగతాగే వ్యసనం ఉన్నవారికి కోవిడ్ సోకే అవకాశాలు ఎక్కువని, వైరస్ సోకిన తర్వాత కూడా వారికి దుష్ఫలితాలు ఎక్కువని ఎప్పటికప్పుడు ఆధారాలతో తేలుతోందని మంత్రి వివరించారు.
- మద్యపాన వ్యసనానికి గురికావడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని, ఇది మరింత నష్టదాయకమని, ఇతర మత్తు మందులు, మాదక ద్రవ్యాల వ్యసనం ఉన్నా ఇదే నష్టం జరుగుతుందని కేంద్రమంత్రి వివరించారు.
- మత్తు మందులు, మాదక ద్రవ్యాల సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విధానాన్ని అమలు చేయడంలో తన అనుభవాలను కేంద్రమంత్రి గుర్తుకు తెచ్చుకున్నారు. మాదకద్రవ్యాల వినియోగం కారణంగా తలెత్తే నష్టాలను, హానికరమైన పరిణామాలను నివారించేందుకు ఆరోగ్య నిపుణులకు, సహాయంగా కొన్ని ప్రమాణబద్ధమైన మార్గదర్శకాలు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.
- మత్తుమందులు, మాదక ద్రవ్యాల వ్యసనాన్ని మాన్పించేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రమాణబద్ధమైన చికిత్సా మార్గదర్శక సూత్రాలను ప్రతి ఆసుపత్రి అనుసరించవచ్చని మంత్రి అన్నారు.“మద్యం, మత్తుమందుల దుర్వియోగ రుగ్మతల చికిత్సలో ఏర్పడిన అంతరాన్ని తగ్గించడానికి ఈ మార్గదర్శక సూత్రాలు దోహదపడతాయి. ఆరోగ్యవంతంగా, ఆనందదాయకంగా, సుసంపన్నంగా దేశం ఎదగడానికి ఈ మార్గదర్శకాలు ఉపకరిస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
- కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అనుసరించవలసిన వ్యవహారశైలిపై ప్రభుత్వం చేపట్టిన ప్రచారం, అవగాహనా కార్యక్రమం విజయవంతం కావడం అభినందనీయమని కేంద్రమంత్రి అన్నారు. సమస్య పరిష్కారానికి మరింత భారీ ఎత్తున చైతన్య కార్యక్రమం చేపట్టవలసి ఉందన్నారు.
- “ఇది సామాజిక సమస్య. వైద్యలోకానికి, ప్రజాజీవితంలో ఉన్నవారికి మాత్రమే పరిమితమైనది కాదు. సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమంలో ధార్మిక సంఘాలు, మతపరమైన సంస్థలకు కూడా ప్రమేయం కల్పించాలి.
- వ్యసనాలపై పోరాటంలో సమాజానికి, వైద్య లోకానికి మధ్య అవగాహన, సహకారం ఎంతో అవసరం. నవ భారతదేశంపై ప్రధాని కల సాకారానికి ఇది మరింత ఆవశ్యకం” అని డాక్టర్ హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. మత్తు మందులు, మాదక ద్రవ్యాల వ్యసనంపై చికిత్సకు సంబంధించి 76నుంచి 85శాతం వరకూ అంతరం నెలకొన్నట్టు మానసిక ఆరోగ్యంపై 1996లో జరిగిన జాతీయ సర్వే తెలిపింది. పొగాకు, మద్యం, గంజాయి వంటి వాటి వినియోగానికి సంబంధించి చికిత్సలో ఈ పరిస్థితి నెలకొంది. వ్యసనాల నివారణ లక్ష్యంగా ప్రమాణబద్ధమైన చికిత్సా మార్గదర్శకాలకు నిపుణుల బృందం రూపకల్పన చేసింది.
- పొగాకు నియంత్రణ, మాదక ద్రవ్యాల వ్యసన చికిత్సా కార్యక్రమం ద్వారా నియమితులైన నిపుణుల బృందం ఈ మార్గదర్శక సూత్రాలను తయారు చేసింది. బెంగళూరుకు చెందిన జాతీయ మానసిక ఆరోగ్య, నాడీ మండల పరిశోధనా సంస్థ (నిమ్హాన్స్), న్యూఢిల్లీకి చెందిన అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), చండీగఢ్ కు చెందిన స్నాతకోత్తర వైద్యవిద్యా పరిశోధనా సంస్థ (పి.జి.ఐ.ఎం.ఇ.ఆర్.), వర్ధమాన్ మహావీర్ వైద్య కళాశాల, సఫ్దర్ జంగ్ ఆసుపత్రి, అటల్ బిహారీ వైద్యశాస్త్రాల అధ్యయన సంస్థ, డాక్టర్ ఆర్.ఎం.ఎల్. ఆసుపత్రికి చెందిన మానసిక వైద్య నిపుణులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గదర్శక సూత్రాలు డిజిటల్ లైబ్రరీ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ లింక్ నొక్కండి
- దీని ద్వారా కూడా మార్గదర్శకాలు అందుబాటులో ఉంటాయి.
- చికిత్సా మార్గదర్శకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీని మరింత విస్తరించే అవకాశం ఉంది. దేశంలో మత్తు మందులు, మాదక ద్రవ్యాల వ్యసనాల చికిత్సకు సంబంధించి వినియోగించదగిన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వనరులతో ఈ లైబ్రరీని మరింత విస్తరించబోతున్నారు.
- మార్గదర్శకాలతో కూడిన ఈ పుస్తకం ద్వారా డాక్టర్లకు డిజిటల్ శిక్షణ ఇవ్వవచ్చు. చికిత్సా అవకాశాలకు నోచుకోని వారికి, మారుమాల ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లు, ఆరోగ్య వృత్తి నిపుణుల ద్వారా చికిత్స అందించడమే ఈ శిక్షణ లక్ష్యం.
- పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి రాజేశ్ భూషణ్, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
- న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ రాకేశ్ చద్దా, బెంగళూరుకు చెందిన నిమ్హాన్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బి.ఎన్. గంగాధర్, మార్గదర్శక సూత్రాల పుస్తకం రూపకల్పనలో పాలుపంచుకున్న నిపుణులు ఆన్ లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
- ఆధారం : pib
0 Comments