👉 సముద్రంలో ఎగిరే షిప్ ,పడవలు ,కొండలు

 

👉ఏమిటి : ఫటా మోర్గానా

👉ఎందుకు : వాతావరణంలో ఉండే కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడే దృష్టి భ్రమ


👉
మన వాతావరణంలో ఉండే కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడే దృష్టి భ్రమ (ఇల్యూషన్‌). సింపుల్‌గా చెప్పాలంటే.. వేసవిలో కనిపించే ఎండమావుల లాంటి పరిస్థితి అనొచ్చు.

👉సముద్రంలో దూరంగా ఉన్న నౌకలు గాల్లో తేలుతున్నట్టుగా కనిపించే ఈ దృష్టి భ్రమను ఫటా మోర్గానాఅంటారు. నౌకలేకాదు.. దూరంగా సముద్రం కూడా కొంత పైకి లేచినట్టుగా అనిపిస్తుంటుంది.

👉పలుచోట్ల సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి కాస్త అరుదుగా ఈ తరహా దృష్టి భ్రమ కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

👉బ్రిటన్‌లోని కార్న్‌వాల్, డెవన్, అబెర్డీన్‌షైర్‌ తీర ప్రాంతాల్లో ఇటీవల కొందరు ఇలా నౌకలు గాల్లో తేలుతున్నట్టు గా కనిపించడంతో ఆశ్చర్యపోయారు.

👉సముద్ర తీర ప్రాంతాల్లో ఎండగా ఉన్నప్పుడు.. ఓ వైపు భూమి, మరోవైపు సముద్ర ఉపరితలం వేడెక్కుతాయి. వీటికి ఆనుకుని ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది.

👉ఇలా వేడెక్కిన గాలి తేలికగా మారి పైకి వెళుతూ.. చల్లటి గాలి కిందికి దిగుతుంది.

👉దీనివల్ల కింద ఉన్న గాలి చల్లగా, ఆపై కొంత వేడిగా, ఇంకాపైన మరింత వేడిగా.. గాలి పొరలు పొరలుగా ఏర్పడుతుంది. ఈ పొరలు నీటిపై వేరుగా, భూమిపై వేరుగా ఉంటాయి.

👉సముద్రంలో దూరంగా ఉన్న నౌకల నుంచి వచ్చే కాంతి.. ఇలా వేర్వేరుగా ఉన్న గాలి పొరల్లోంచి వెళుతున్నప్పుడు వంగి ప్రయాణిస్తుంది.

👉చివరిగా మన కంటికి చేరే సమయానికి బాగా వంగి ఉంటుంది. కానీ మన కన్ను, మెదడు సాధారణంగా.. కాంతి సరళ రేఖా మార్గాన్ని(స్ట్రెయిట్‌ లైన్‌ను) పరిగణనలోకి తీసుకుంటాయి.

👉ఆ స్ట్రెయిట్‌ లైన్‌లో నౌక ఉన్నట్టు గుర్తిస్తాయి. దీంతో నౌకలు సముద్రంపై గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపిస్తాయి. దీనినే ఫటా మోర్గానాఅంటారు. కొన్నిసార్లు భూమిపైన కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి.

👉సాధారణంగా ఏదైనా వస్తువుపై పడిన కాంతి ప్రతిఫలించి.. నేరుగా సరళ రేఖా మార్గంలో ప్రయాణించి మన కంటిని చేరుతుంది.

👉మన కళ్లు, మెదడు అదే స్ట్రెయిట్‌ లైన్‌ను పరిగణనలోకి తీసుకుని.. ఆ స్థానంలో సదరు వస్తువు ఉన్నట్టు గుర్తిస్తాయి. అయితే గాజు, నీళ్లు, గాలి వంటి వేర్వేరు వాటిల్లో కాంతి ప్రయాణిస్తున్నప్పుడు.. వాటి సాంద్రత, ఉష్ణోగ్రత వేరుగా ఉండటంతో వంగుతుంది. ఆ వస్తువులు భిన్నంగా కనిపిస్తాయి.

👉ఉదాహరణకు గాజు గ్లాసులో నీళ్లు పోసి, ఏదైనా కర్ర, పెన్ను వంటివి పెడితే.. నీళ్లలోపల ఉన్న భాగం వంగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటివి చాలా వరకు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu