👉 చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ పేరుతో ఉన్న నాణెం

 👉 ఏమిటి : చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ పేరుతో ఉన్న నాణెం

👉 ఎవరు : శాతవాహనుల వెండి నాణెం

👉 ఎక్కడ : జున్నూరు ప్రాంతంలో

👉 ఎందుకు  : తొలిసారిగా ఓ మహిళ పేరుతో ఉన్న నాణెం కావడం



👉 తన పేరుపై నాణెం వేయించిన తొలి మహిళ .... అశ్వమేధ యాగంతో ధైర్యాన్ని చాటిందీ ఆమెనే

👉 ధీర వనితలు అనగానే చరిత్ర పుటల్లో రాణి లక్ష్మీబాయి, రుద్రమదేవి లాంటి వారి పేర్లు కనిపిస్తాయి. వారి వీరగాథలు తెరలు తెరలుగా కదలాడుతాయి.

👉 చరిత్రకు సజీవ సాక్ష్యాలు కనిపించటం మొదలైన తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని భావి తరాల మహిళలకు బాట చూపిన మహిళ నాగనిక.

👉 దేశంలో మూడొంతుల ప్రాంతాన్ని అప్రతిహతంగా ఏలిన శాతవాహన వంశానికి చెందిన ధీశాలి నాగనిక.

👉 శాతవాహన రాజు శాతకర్ణి భార్య.

👉 మూడు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన శాతవాహన సింహాసనాన్ని అంతే గంభీరంగా అధిష్టించి ఏలిన చక్రవర్తి శాతకర్ణి. ఆయన పాలనకు కూడా అంతే మంచి పేరుంది.

👉 మహారాష్ట్రలోని పుణే ఆవల నానేఘాట్‌ గుహలో వెలుగు చూసిన ఓ శాసనం మహిళల ధీరత్వానికి నిలువుటద్దం.

👉 అది నాగనిక వేయించిన శాసనం.

👉 శాతకర్ణి మరణించాక రాజ్యభారాన్ని ఆమెనే చూసుకున్నారని చరిత్రకారులు భావిస్తుంటారు. కానీ దానిని రుజువు చేసే ఆధారాలు పెద్దగా లేవు.

👉 కానీ నానేఘాట్‌ శాసనాన్ని నాగనిక వేయించటం ఆమె పాలనను బలపరుస్తోంది.

👉 ఈ శాసనంలో ఆమె శాతవాహన తొలి చక్రవర్తి చిముకుడు, తన భర్త శాతకర్ణి, కుమార భాయ, తన తండ్రి త్రణకయిరో, కుమార హకుసిరిల ప్రతిమలు, వారి కీర్తిని చెక్కించారు.

👉 సాధారణంగా తమ పాలనకు గుర్తుగా చక్రవర్తులు, రాజులు నాణేలు చెలామణిలోకి తీసుకొస్తారు. ఏ ప్రాంతాన్నైనా ఓడించి తన పరిధిలోకి తెచ్చుకుంటే.. అక్కడ అప్పటివరకు ఉన్న నాణేలను పక్కనపెట్టేసి, తమ పేరు, గుర్తుతో ఉండే సొంత నాణేలు వేయిస్తారు.

👉 అప్పట్లో నాణేలకు అంత ప్రాధాన్యం ఉండేది. తమ పేర నాణెం వేయిస్తే.. ఆ ప్రాంతంలో తమ మాటకు ఎదురు లేదన్నట్టుగా భావించేవారు.

👉 అయితే చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ పేరుతో ఉన్న నాణెం జున్నూరు ప్రాంతంలో లభించింది. అది శాతవాహనుల వెండి నాణెం. దానిపై నాగనిక పేరు ఉంది. తన భర్త శాతకర్ణి పేరు కూడా అందులో వేయించింది.

👉 నాగనిక పాలించారనడానికి ఇదే గుర్తు అని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక పెద్దపెద్ద చక్రవర్తులు చేసే అశ్వమేధ యాగాన్ని కూడా ఆమె నిర్వహించినట్టు ఆ నాణేలు చెబుతున్నాయి.

👉యాగ అశ్వం ఎంత దూరం వెళితే అంతవరకు తమ రాజ్యంగా పేర్కొనేవారు. ఇలా అశ్వమేధ యాగం నిర్వహించిన వారు.. తమ రాజ్య నాణేలపై గుర్రం బొమ్మను ముద్రిస్తారని చరిత్ర చెబుతోంది.

👉 నాగనిక పేరుతో దొరికిన కొన్ని నాణేలపై అశ్వం గుర్తు కనిపించటంతో ఆమె అశ్వమేధయాగం చేశారని భావిస్తున్నారు.

👉 మొత్తంగా సువిశాల శాతవాహన సామ్రాజ్యాన్ని ఆమె ధైర్యంగా ఏలారన్నది చరిత్రకారుల మాట. ఈ లెక్కన చరిత్రలో నిలిచిన ధీర వనితల్లో అమెది ముందు వరసే అనటంలో ఏమి సందేహం పడవలసిన పనిలేదు.

Post a Comment

0 Comments

Close Menu