✊అంబేద్కర్ జయంతి వేడుక దేనికి?

✊ బడిపిల్లలకు సెలవుకోసం-రాజకీయ పార్టీలకు ప్రచారం కోసమా?

అంబేద్కర్ జయంతి అంటే రాజకీయ లబ్ధికి ప్రచార సాధనమా?

అంబేద్కర్ ఆశయాలు సాదించగలిగామా! అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసుకుంటున్నామా?

✊ స్వేచ్ఛ, సమానత్వం గురించి రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పింది అమలవుతుందా!

రిజర్వేషన్లు గురించి రాజ్యాంగంలో అంబేద్కర్ ఏమి చెప్పారు? మన పాలకులు ఏమి చేస్తున్నారు?

✊ మత స్వేచ్చహక్కు రాజకీయస్వేచ్ఛ హక్కుగా మారిపోయిందా?

✊ రాజ్యాంగ పదవులు అడ్డంపెట్టుకుని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నామా ?

✊ అంబేద్కర్ కి అసలైన నివాళికి మనం ఏం చేయాలి!

 

             డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి వీటి అన్నింటికన్నా గొప్పగా చెప్పాలంటే కారణ జన్ముడు. భారతదేశంలో ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు దేశభక్తులు, స్వాతంత్ర పోరాట యోధులు,ప్రపంచం మెచ్చుకున్న మేధావులు వున్నా... డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారు మాత్రం అందరిలో ప్రత్యేకం దానికి కారణం మన భారత రాజ్యాంగ రచనలో ఆయన పోషించిన పాత్ర అజరామరం.అప్పటి భారత ప్రభుత్వం,గాంధీజీ కూడా ఆయన మేధస్సుకి అంతటి సముచిత స్థానం కల్పించారు కనుకనే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నేటికీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచి వెలుగొందుతుంది. అంతటి మహానుభావుని పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 14న ఆయన ఆశయాలగురించి ఆయన చూపిన సన్మార్గాల గురించి స్మరించుకోవాల్సిన రోజు, సింహవలోకనం చేసుకోవాల్సిన రోజు.

✊ ఇదంతా నాణ్యానికి ఒక వైపు మాత్రమే మరి నాణ్యానికి మరో వైపు ఏముంది!

            అంబేద్కర్ జయంతి అంటే బడిపిల్లలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సెలవు రోజు. పొరపాటున ఏప్రిల్ 14 తేదీ ఏ ఆదివారం నాడో వచ్చిందో బడిపిల్లలు,ఉద్యోగులు తెగ భాదపడిపోయే రోజు ఎందుకంటే ఒక సెలవు కోల్పోయమే అని. అంబేద్కర్ జయంతి అంటే రాజకీయ పార్టీలకు అయితే రాజకీయ ఉపన్యాసాలకు, రాజకీయ లబ్ధికి ఒక ప్రచార సాధనం. ఎందుకంటే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14రాగానే అంబేద్కర్ విగ్రహానికి లేదా ఫోటోకి పూలమాల వేసి నివాళి అర్పించి వెంటనే రాజకీయ ఉపన్యాసాలు. మా పార్టీ అంబేద్కర్ ఆశయాలల్లో నుండి పుట్టింది,మాపార్టీ అంబేద్కర్ స్పూర్తితో నడుస్తుంది,మా ప్రభుత్వం అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తుంది అని మొదలు పెట్టేస్తారు.

                  ఎక్కువ మాట్లాడితే మా పార్టీ అధికారంలోకి వస్తే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టిస్తాం.మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రపంచంలోనే ఎతైన విగ్రహం పెట్టిస్తాం. మా ప్రభుత్వం అంబేద్కర్విగ్రహానికి ఇన్ని కోట్లు డబ్బు కేటాయించింది అని డాంబికాలు పలుకుతుంటారు.

✊ ఇవేనా అంబేద్కర్ కోరుకున్నది ?

✊ ఇదేనా అంబేద్కర్ కి నివాళి ?

✊ ఇదేనా సగటు మనిషికి అవసరం అయినది?

రాజకీయ పార్టీలకు మాత్రం అంబేద్కర్ ఆశయాలు అవసరం మరి అధికారంలోకి వచ్చాక అవసరం లేదా ?

                 రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ సిద్ధాంతాలు,అంబేద్కర్ కులం పేరుతోరాజకీయాలు. పొరపాటున అధికారంలోకి వచ్చారో అంబేద్కర్ జయంతి అంబేద్కర్ వర్ధంతి మాత్రమే గుర్తుంటాయ్ ఆశయాలు, సిద్ధాంతాలులాంటివి ఉపన్యాసాలల్లో మాత్రమే ఉంటాయి. 100వ జయంతికి 100 అడుగులు, 125వ జయంతికి 125 అడుగులు విగ్రహం కట్టిస్తాం అంటే దానికి అనుకూలమైన మీడియా భజన కార్యక్రమం. మన దౌర్యభాగ్యం ఏంటంటే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను, నాయకులను బండ భూతులు తిట్టుకోవడం ఆనవాయితి.

             ఏ రాజకీయ కార్యక్రమంలో కానివ్వండి, అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కానివ్వండి,వర్ధంతి సందర్భంగా కానివ్వండి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం! అంబేద్కర్ అడుగుజాడల్లో నడుద్దాం! అనడమే ఇప్పటికి మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 70ఏళ్లకు పైమాటే ఇప్పటికీ సాధిద్దాం నడుద్దాం అంటే సాదించేది ఎప్పుడు ? నడిచేది ఇంకెప్పుడు?.

✊ రాజ్యాంగంలో చెప్పిన  స్వేచ్ఛ, సమానత్వాలు ఎక్కడ?

                 సువిశాల భారతదేశంలో  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో  స్వేచ్ఛ సమానత్వాలు అందరికీ ఒకేలా ఉన్నాయా? ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామా? స్వేచ్ఛగా ప్రభుత్వాలు నడపగలుగుతున్నారా? స్వచ్ఛగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలుగుతున్నామా ? స్వచ్ఛగా ఓటు వేయగలుగుతున్నామా ? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.అందరూ స్వేచ్ఛగాజీవిస్తున్నాము అనుకుంటే కొన్ని రాష్ట్రాలలో 365రోజులు 24 గంటలు కర్ఫ్యూ/144సెక్షన్ ఎందుకు అమలు అవుతుంది. నెలలు సంవత్సరాలు తరబడి గృహ నిర్బందాలు ఎందుకు జరిగుతున్నాయ్.

                  ప్రభుత్వం అంటే ప్రజాలచేత ఎన్నుకోబడింది. అది కేంద్ర ప్రభుత్వం కావొచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు ఏదైనా ప్రభుత్వమే దాంట్లో జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తేడా ఎందుకొస్తుంది. ప్రభుత్వాలు స్వచ్ఛగా నడుపుకోగలుగుతుంటే జాతీయ పార్టీల కబందహస్తాల మధ్య ప్రాంతీయ పార్టీలు ఎందుకు నలిగిపోతున్నాయి? అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలను ఓకేలాగా ఎందుకు కేంద్ర ప్రభుత్వాలు చూడలేకున్నాయ్.

                   కులానికో పార్టీ మతానికో పార్టీ ఒక్కోదేవుడికి ఒక్కోపార్టీ మరి ఇన్ని అవరోదాలలో స్వేచ్ఛగా ఓటు వేయగలుగుతున్నామా ? భారత ప్రభుత్వం నడిపే పెద్దలు వారి రాజకీయ అవసరాలకు హిందువుల దేవాలయాలకు వెళ్లొచ్చు క్రైస్తవుల చర్చి కి వెళ్లొచ్చు ముస్లిం మసీదులు వెళ్లొచ్చు అది దేశభక్తి సమాజ హితం.అదే ఒక చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ నడిపే ప్రభుత్వ పెద్దలు చర్చి కి వెళితే క్రిస్టియన్, మసీదుకు వెళితే హిదువుల వ్యతిరేకి అని దేశద్రోహం అని విమర్శలు మరి సమానత్వం ఎక్కడుంది?

                      పెద్ద పార్టీలకు అనుకూలంగా ఉంటే దేశ్ కీ నేత అదే వారికి వ్యతిరేకంగా ఎదురు నిలబడితే వెంటనే అవినీతి కేసులు, దేశద్రోహం కేసులు, సంబంధంలేని కేసులు అన్నీ ఒక్కేసారి వచ్చేసి జైలుకి పంపడం. పక్క పార్టీలో ఉంటే అవినీతిపరులు మన పార్టీలోకి వస్తే అన్నీ కేసుల్లో క్లీన్ చిట్లు మరి ఇంకెక్కడి స్వేచ్ఛ ఇంకెక్కడి సమానత్వం.

✊ రిజర్వేషన్లు గురించి అంబేద్కర్ చెప్పింది ఏంటి? మన పాలకులు చేస్తున్నదేంటి ?

                సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి సమాజంలో తోటి వారితో సమానత్వాలు లేనివారికి వారు మళ్లీ సామాజికంగా ఆర్థికంగా అన్నివిధాల సమానత్వం కలిగేవరకు రిజర్వేషన్లు పరిమిత కాలానికి వారికి  వర్తింపజేయాలి ఈలోపు అన్నీ అసమానతలు తొలగిపోవాలి అని అంబేద్కర్ చెబితే మన పాలకులు అది వదిలేసి అలాంటి వారి అభ్యున్నతికి తోడ్పడకుండా  దళితులు అని బలహీన వర్గాలు అని వెనకబడిన వర్గాలు అని విభజించి వారికి సంపూర్ణంగా సహాయం చేయకుండా రాజకీయ అవసరాలకు వారిని ఓటు బ్యాంకు గా మలుచుకుని మొదట నిర్ణయించిన కాలవ్యవదిని పెంచుకుంటూ పోతూ వెనకబడినవారిని అలా వెనకాలే ఉండేలా శాశ్విత మార్గంలో పరిష్కారం చూపకుండా 70ఏళ్లకు పైన ఇంకా కూడా రిజర్వేషన్లు కొనసాగిస్తూనే వున్నారు.

                     అప్పటి నుండి ఇప్పటివరకు SC, ST, BC మైనార్టీ వారు ఈ రిజర్వేషన్లు రొంపులో కొట్టుమిట్టులాడుతూనే వున్నారు. మాకు తక్కువ మీకు ఎక్కువ మాది మాకు ఇవ్వండి మాకు సరిపోవట్లేదు అని వారిలో వారు కొట్టుకు చస్తున్నారే తప్ప ఇన్నేళ్ళుగా ఏ రాజకీయ పార్టీ గానీ ఏ ప్రభుత్వం కానీ అంబేద్కర్ ఆశించిన, రిజర్వేషన్లు అవసరం లేని సమాజాన్ని నిర్మిద్దాం అని ఏ ఒక్కరు ఆలోచించట్లేదు.

                     మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతి, మహిళలకు సమాన హక్కు, అని రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చే పార్టీలు ఇప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అసమానతలు చూపుతూనే వున్నారు.

✊ మత స్వేచ్చహక్కు రాజకీయస్వేచ్ఛ హక్కుగా మారిపోయిందా?

                రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కుల్లో ఒకటి అయిన మత స్వేచ్ఛ హక్కు కాల క్రమేణా రాజకీయ స్వేచ్ఛ హక్కుగా మారిపోయింది అనడంలో అతిశయోక్తి కాదేమో.మన ఖర్మ ఏంటంటే మతానికి ఒక రాజకీయ పార్టీ ఉంది మన భారతదేశంలో హిందువులకు ఒక పార్టీ, ముస్లింలు కి ఇంకొక పార్టీ, క్రైస్తవులకు మరొక పార్టీ. సామాన్య ప్రజలలో ఆ మతపిచ్చి లేనప్పటికినీ మన రాజకీయ నాయకులు జనాలను అలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వారికి అనుకూలంగా మలుచుకోగల నైపుణ్యం కలవారు.

                 ప్రజలు ఏ పార్టీకి సానుకూలంగా వుంటారో వారందరు పలానా మతం వారు అనే నిర్ధారణకి వచేస్తున్నారు.పొరపాటున పలానా పార్టీ వారు పలానా విషయంలో తప్పు చేస్తున్నారు అని మాట్లాడితే వారందరు హిందు మతానికి వ్యతిరేకం, దేశభక్తి లేదు వారందరు దేశద్రోహులు అని భౌతిక దాడి చేయడం తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి దిగజారిపోయి వున్నారు. హిదుత్వాన్ని నమ్మే పార్టీ అధికారంలో ఉంటే వారు ఏది చేసినా హిందూ ధర్మం కోసం, ఇంకెవరు ప్రశ్నించకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే అది దేశద్రోహం, హిదువులకు శత్రువులుగా చిత్రీకరించడం చేస్తారు మరి ఇంకా ఎక్కడుంది మనదేశంలో మత స్వేచ్ఛ. పచ్చిగా చెప్పాలంటే భారతదేశ ప్రధానమంత్రిహిందు గుడులకు వెళ్లొచ్చు, క్రైస్తవ చర్చిలకు వెళ్లొచ్చు, ముస్లింల మసీదులకు వెళ్లొచ్చు అది స్వేచ్ఛ, సమాజ హితం, అందరూ సమానం అని చాటిచెప్పడం.

                  అదే తమ పార్టీకి సంబంధంలేని ఇంకెవరైనా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు  హిందువుల గుడులకు వెళితే రాజకీయ లబ్ది కోసం,క్రైస్తవ చర్చిలకు వెళితే హిందువుల వ్యతిరేకి, ముస్లింల మసీదులకు వెళితే దేశద్రోహులు అని దిగజారుడు రాజకీయాలు చేస్తుంటే ఇంకెక్కడి స్వేచ్ఛ, ఇంకెక్కడి సమానత్వం, ఎక్కడుంది మతస్వేచ్ఛ హక్కు.

రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగబద్ద పదవులను అడ్డం పెట్టుకుని రాజ్యంగానికే తూట్లు

                  రాష్ట్రపతి, గవర్నర్, ఎన్నిక కమిషన్, న్యాయస్థానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాజ్యాంగ వ్యవస్థను రాజకీయాల్లోకి లాగి వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ది పొందడం ఆనవాయితీ అయిపోయింది.

 

✊ వివిధ రాష్ట్రాలలో వివిధ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో చూద్దాం....

👉కేంద్ర ప్రభుత్వానికి లొంగి వారి కనుసన్నల్లో రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు నడుచుకుంటే సరి. లేదంటే సంక్షోభం సృష్టించడం రాష్ట్రపతి పాలన విందించేయడం.ఉదాహరణకు గతంలో జమ్మూకాశ్మీర్.

👉ఇంకో రాష్ట్రంలో మన పార్టీ కాకుండా ఏదైనా ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి కి సహకరించకుండా ప్రతి విషయంలో గవర్న తో  అడ్డుకోవడం. ఉదాహరణకు న్యూ ఢిల్లీ.

👉ఒకవేళ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత మెజార్టీ రాకపోతే అవతలి పార్టీ వాళ్ళని ప్రలోభ పెట్టడం చీలికలు తేవడం, గవర్నర్ సహాయంతో మెజారిటీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటుకు పిలుపు ఇవ్వడం. ఉదాహరణకు గోవా రాష్ట్రం.

👉ఉన్నఫలంగా ఒక ప్రభుత్వాన్ని కూల్చేసి మనం అధికారం చేపట్టాలంటే మనకు ఎంత మంది సభ్యులు తక్కువ ఉన్నారో అంతమంది అవతల పార్టీ వారిదగ్గర రాజీనామాలు చేయించి,సభాపతి సహకారంతో ఒక రాష్ట్రంలో, కోర్ట్ ద్వారా ఇంకో రాష్ట్రంలో ఆ రాజీనామాలు ఆమోదింపజేసి అవతలి వారి మెజారిటీ తగ్గించి వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టించి అధికారాన్ని చేపట్టడం. ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం.

 👉అబ్బో చెప్పుకుంటుపోతే బోలెడు.

👉ఇదేనా అంబేద్కర్ కి నివాళి?

👉అంబేద్కర్ కి నిజమైన నివాళి అంటే ?

👉రిజర్వేషన్లు అవసరం లేని పరిస్థితులు కల్పించడం

👉కుల మత జాతి బేధాలు లేని సమాజాన్ని  నిర్మించడం

👉 స్త్రీలకు సమాన హక్కు, సమాన ప్రాతినిధ్యం, సమాన గౌరవాన్ని కల్పించడం

ఒక్కమాటలో చెప్పాలంటే మన అసలైన భారతదేశ రాజ్యాంగాన్ని తూ చా తప్పకుండా అమలు చేయడం.

                భారత రాజ్యాంగాన్ని రచించడంతో మా బాధ్యత నెరవేర్చాము దాన్ని సక్రమంగా అమలు చేయడమా? చేయకపోవడమా అనేది ప్రభుత్వాల చేతుల్లో ఉంది. అని ఆనాడే అంబేద్కర్ అన్నారంటే ఎంతటి ముందుచూపుతో చెప్పారో.అంబేద్కర్ జయంతి అంటే రాజకీయ కార్యక్రమం కాదు, ఊకదంపుడు ఉపన్యాసాలల్లో చెప్పే సొల్లు కబుర్లు కాదు అని అధికారంలోకి వచ్చాక ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసి చూపించడం ఆయనకు అసలైన నివాళి.

అంబేద్కర్ జయంతి అంటే ఒక సెలవు రోజు కాదు ఒక మహానుభావుని పుట్టినరోజు అని ప్రభుత్వాలు ఆయన ఆశయాలు సాధించి  నేటి భవితకు చూపడం ఆయనకి మనం ఇచ్చే అసలైన నివాళి.

  RK శాతరాసి  (9629301038             

Post a Comment

0 Comments

Close Menu